KONDA
VISHWESHWAR
REDDY

తెలంగాణ రాష్ట్రం నా జన్మహక్కు – కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నేడు రాజకీయాల్లోకి వచ్చే వ్యక్తులు గాని, ఉద్యమాల్లో పాలుపంచుకునే నాయకులు గాని ఏదో ఒక కారణంతో రావడం జరుగుతున్నది. పదవికోసం ఒకరు, సంపాదన కోసం మరొకరని రావడం జగమెరిగిన సత్యము. కాని ఈ రెండింటికి వ్యతిరేకంగా ప్రజాసేవ చేయడానికే వీరి కుటుంబం కంకణం కట్టుకున్నది. మొన్నటివరకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పరోక్షంగా మద్దతు తెలుపుతూ తెలంగాణ అభివృద్ధికోసం అనేక కార్యక్రమాలను చేపట్టారు. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజాసేవ చేయడమే కాకుండా తెలంగాణలో జరిగిన అన్యాయాలను యువతకు వివరించడంలో వీరి పాత్ర ఎనలేనిది. వీరి తాతగారు కొండా వెంకట రంగారెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడుగా ఎంతో పేరుప్రఖ్యాతులు పొందినవారు. నిజాం నవాబు కాలంలోనే చట్టసభలకు నామినేట్ అయ్యారు. ఆ తరువాత డిప్యూటీ సీఎం పీఠాన్ని కూడా కైవసం చేసుకున్నారు. అలాగే నాన్నగారు కొండా మాధవరెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, మహారాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గా, మహారాష్ట్ర గవర్నర్ గా నీతి, నిజాయితీలతో సమర్ధవంతంగా సేవలందించారు. వారి కుటుంబం ఎన్నో రకాల పదవులను అలంకరించినప్పటికీ ఏనాడు కూడా అవినీతి ఆరోపణలు అంటిన దాఖలాలు లేవు. నిజాయితీయే ఊపిరిగా పనిచేస్తున్న కుటుంబం. వారి తాతల కాలం నుండి నేటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం, ఈ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలపైన సమగ్రంగా పోరాటం చేస్తున్నారు. తాత, తండ్రి (కొండా వెంకట రంగారెడ్డి, మాధవరెడ్డి) అడుగుజాడల్లో పయనిస్తూ తెలంగాణ అభివృద్ధి వెనకబాటును ప్రజలకు వివరించాలనే లక్ష్యంతో అలాగే ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను తెలపాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీలోకి చేరి ప్రత్యక్ష రాజకీయ రంగ ప్రవేశం చేశారు. వారే సిటడెల్ రీసెర్చ్ & సొల్యూషన్స్ లిమిటెడ్ సి. ఇ. ఓ., చేవెళ్ళ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ‘సలహా’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుదీర్ఘ వ్యాపార, రాజకీయ అనుభవాలను తెలిపారు.

కుటుంబ నేపథ్యం:

జస్టిస్ కొండా మాధవరెడ్డి, శ్రీమతి జయలత అనే పుణ్యదంపతులకు జన్మించిన విశ్వేశ్వర్ రెడ్డి తండ్రి న్యాయవాది కావడంతో వీరిలో చిన్నప్పటి నుండి నీటి, నిజాయితీలు అబ్బినాయి. ఇంజనీరింగ్ విద్యార్థులకు గురువైన మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరునే వీరికి తాతగారు కె.వి. రంగారెడ్డి నామకరణం చేశారు. వారి ఆశయాలకు అనుగుణంగానే ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి తల్లిదండ్రులు పెట్టిన పేరును సార్ధకం చేశారు. అమెరికానందు ఎమ్మెస్ లో ఇంజనీరింగ్ పట్టభద్రులైనారు. విద్యాభ్యాసానంతరం అక్కడే ఒక వ్యాపార సంస్థను (ఎలక్ట్రానిక్స్ కంపెనీ) నెలకొల్పారు. దీనిలో రక్షణ, విమానయాన, రాకెట్స్ సంబంధించిన ఎలక్ట్రానిక్స్ తయారయ్యేవి. అనేక నూతన పరికరాలను కనుగొనడమే కాకుండా అనేక పరిశ్రమలలోని నైపుణ్యమును పెంపొందించడంలో వీరు కీలక పాత్ర పోషించారు. 1989 సం.లో అపోలో గ్రూప్ చైర్మన్ డా. సి. ప్రతాప్ రెడ్డిగారి కుమార్తె సంగీతారెడ్డిని వివాహమాడినారు. వ్యాపార రంగంలో విజయం సాధించినప్పటికీ, అక్కడ ఉన్న పరిజ్ఞానాన్ని మన దేశానికి అందించాలనే సంకల్పంతో, అనేక పరిశోధన ఫలితాలను మన దేశ విద్యార్థులకు అందించాలనే తపనతో స్వదేశానికి తిరిగి వచ్చారు.

అనేక కంపెనీలకు సి. ఇ. ఓ. & ఎం. డి. లుగా

ఏ వ్యక్తైనా ఒక రంగంలోనే తన ప్రతిభను కనబరిచి అక్కడ వారికున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి పేరు ప్రఖ్యాతులు పొందడం సహజం. కాని విశ్వేశ్వర్ రెడ్డి తనకున్న తెలివితేటలను అందిపుచ్చుకొని వివిధ రంగాల్లో ముందుకెళ్ళారు. అనేక రకాల సాఫ్ట్ వేర్ లను కనిపెట్టి విప్రోలాంటి సంస్థల్లోకూడా అభినందనలు పొందారు. వీరు కనిపెట్టిన సాఫ్ట్ వేర్ లు నేడు వివిధ దేశాల్లో ఉపయోగిస్తున్నారని సగర్వంగా తెలిపారు. విప్రో హెల్త్ కేర్ ఐటి లిమిటెడ్ కు, జిఇ మెడికల్ సిస్టమ్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంటి సంస్థలకు సిఇఓ & ఎం. డి. లుగా సమర్ధవంతమైన బాధ్యత నిర్వహించారు. అలాగే స్టిఫెన్ డిజైన్ & ఇంజనీరింగ్ టెక్నిక్ ఇండియా లిమిటెడ్ కు ఎం. డి. గా వ్యవహరించారు. ఆరోగ్య పరిరక్షణ కోసం ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ విభాగాలను తయారు చేశారు. అదే విధంగా సమాజానికి ఉపయోగపడే మిషనరీలను కనిపెట్టారు. కంపెనీలలోని వినూత్నమైన టెక్నాలజీని అభివృద్ధి చేసి దేశవిదేశాల్లో ఎంతో మందికి ఉపయోగపడే విధంగా కృషి చేశారు. ప్రస్తుతం సొంతంగా ‘సిటడెల్ రీసెర్చ్ అండ్ సొల్యూషన్స్’ కు సిఇఓ గా వ్యవహరిస్తున్నారు.

వైద్య పరిజ్ఞానాన్ని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చే విధంగా వినూత్న టెక్నాలజీని కనిపెట్టి వాటి మీద అనేక పేటెంట్ హక్కులను పొందిన ఘనత విశ్వేశ్వర్ రెడ్డిదే.

కొండా వెంకట రంగారెడ్డి పేరుమీద జిల్లా నామకరణం:

కె. వి. రంగారెడ్డి దేశానికి స్వాతంత్ర్యం తేవడంలో కీలక పాత్రను పోషించారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతులను పొందినారు. రాజకీయాల్లో అనేక పదవులను అలంకరించి, నీతి, నిజాయితీలతో ఎంతో సమర్ధవంతంగా సేవలందించారు. ఆనాడు నిజాం పాలనలోనే కొండా వెంకట రంగారెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికైనారు. రెవెన్యూ మంత్రిగా, డిప్యూటీ సీ. ఎం. గా చేసిన ఘనత కూడా వీరిదే. అలాగే విద్యాభివ్రుద్దికై ఏ. వి. కాలేజీని స్థాపించారు. నేటికి కూడా ఆ కాలేజీ ఎంతోమంది ఉన్నత విద్యావంతులను సమాజానికి అందించడం ఎంతో గర్వకారణం. అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా ఆనాడే మహిళా డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేసిన ఘనత కూడా వారిదే. అలాగే తెలంగాణ కోసం వీరోచితంగా పోరాడిన ఘనతను కూడా దక్కించుకున్నారు. నేడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడడానికి ఆనాడు వారు వేసిన బీజమే. వారి త్యాగఫలాన్ని, నిజాయితీని గుర్తించి అప్పటి ప్రభుత్వం వారి పేరు మీదుగా రంగారెడ్డి జిల్లా నామకరణం చేశారు. అప్పటి నుండి నేటివరకు కొనసాగుతూనే ఉన్నది.

జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు

కొండా మాధవరెడ్డి న్యాయవాద వృత్తిలోకి అడ్వకేట్ గా ప్రవేశించి ఛీఫ్ జస్టిస్ స్థాయికి చేరారంటే న్యాయవాద వృత్తిలో వారికున్న ప్రతిభ, నైపుణ్యం, నిజాయితీ ఏమిటో మనకు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర హైకోర్టులకు ఛీఫ్ జస్టిస్ గా చేసిన ఘనత మాధవరెడ్డికే దక్కింది. ఆ సమయంలో అనేక సంచలనాత్మకమైన తీర్పులను నిర్భయంగానూ, నిక్కచ్చిగానూ, ధైర్యసాహసాలతో ఇవ్వడం జరిగింది. అలాగే న్యాయం నాలుగు పాదాలమీద నడిచేలా చెయ్యడంలో వీరు ప్రధములు. ముల్కీ నిబంధనలు కోర్టుకొచ్చినప్పుడు ఐదుగురు జడ్జస్ బెంచ్ వేశారు. అందులో నలుగురు ఆంధ్ర వారైతే, మాధవరెడ్డి ఒక్కడే తెలంగాణ వ్యక్తి అయినా దాన్ని వ్యతిరేకించారు. కానీ ముల్కీ రూల్స్ గెలిచాయి. ఆ తరువాత ఆ కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అపుడు వీరి వాదనే గెల్చింది. 1980లో స్వరాజ్ పాల్ కు సంబంధించిన తీర్పులో ఇందిరాగాంధీ అంతటి వారి మాట కూడా వినకుండా జస్టిస్ మాధవరెడ్డి నీతి, నిజాయితీలతో, నిక్కచ్చిగా తీర్పునిచ్చారు. కొంతకాలం మహారాష్ట్ర గవర్నర్ గా కూడా ఎంతో సమర్ధవంతంగా సేవలందించారు. సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ గా పేరుపొందారు. అలాగే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) కు చైర్మన్ గా వ్యవహరించారు. చిన్న రాష్ట్రాల కౌన్సిల్ కు మెంబర్ గా పనిచేశారు. అలాగే న్యాయవాద వృత్తిలోనే కాకుండా మిగతా రంగాల్లో కూడా విద్య, కళారంగాల అభివృద్ధికై వీరు కృషి చేయడం జరిగింది. కాకతీయ యూనివర్సిటీకి డీన్ గా, మెంబర్ గా పనిచేశారు. ఉస్మానియా, నాగార్జున యూనివర్సిటీలకు మెంబర్ గా, అలాగే చైతన్యభారతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లకు చైర్మన్ గా ఉన్నారు. కూచిపూడి ఆర్ట్ అకాడమీకి చైర్మన్, ఇండియన్ హాకీ ఫెడరేషన్ మెంబర్ గా సేవలందించి ఆయా రంగాల అభివృద్ధికి ఎంతో పాతుపదినారు. ఆ తరువాత వారి సేవలకు గుర్తింపుగా వారి తనయుడైన విశ్వేశ్వర్ రెడ్డి జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ ను స్థాపించడం జరిగింది. నిరుద్యోగ విద్యార్ధులకు యూత్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో వివిధ రంగాల్లో(స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, డిజైనింగ్, బోటింగ్, కార్ డ్రైవింగ్, స్కిల్స్ డెవలప్మెంట్, స్పోర్ట్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్, పెయింటింగ్) శిక్షణ ఇస్తూ అనంతరం ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. దీనిలో శిక్షణ పొందాలంటే పదవతరగతి పాసై, ఇంటర్మీడియట్ ఫెయిలయినవారికి అవకాశం కల్పిస్తామన్నారు. ఇప్పటివరకు అనేక మంది విద్యార్థులకు ఉద్యోగావకాశాలను కల్పించటం జరిగిందన్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా అనేక ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి రోగులకు ఉచితంగా మందులు పంపిణీచేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఈ ఫౌండేషన్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.

ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్

తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం తెలపాలనే ధ్యేయంతో ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్ ను ఏర్పాటుచేయడం జరిగింది. ఆంధ్రాపాలకుల కాలంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను (విద్య, ఉద్యోగం, నీటి వనరులు, సహజ వనరులు, విద్యుత్తు మొ.) విద్యార్థులకు తెలియజేయడంలోను, అలాగే గ్రామీన్ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఉద్దేశాన్ని వివరించడంలో ఈ ఫౌండేషన్ కీలకపాత్ర పోషించింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజానీకానికి తెలంగాణ ఆవశ్యకతను తెలియజేసి వారి అభిప్రాయాలను తీసుకొని శ్రీకృష్ణ కమిటీకి రిపోర్టు రూపంలో అందజేయడం జరిగిందన్నారు. అలాగే తెలంగాణ ప్రాంతంలోని విలేజి బోర్డులను ఏర్పాటు చేసి ఆ ఊరి పేరు, ఆ జిల్లా పేరు, తెలంగాణ రాష్ట్రమని రాయించిన ఘనత విశ్వేశ్వర్ రెడ్డిదే. నేడు అదే కల తెలంగాణ ప్రజానీకానికి సాకారం కాబోతుందని తెలిపారు. ఈ ఫౌండేషన్ ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని పరోక్షంగా నడిపించడంలో వీరి పాత్ర అమోఘమైనది.

పైసలకు – ఓట్లు పడవు

2011లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకోసం తాను ప్రచారం చేశానని అప్పుడు నాయకులకంటే ప్రజల్లోనే ఉద్యమ కాంక్ష నరనరాన జీర్ణించుకుపోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు వారి అభ్యర్థుల గెలుపుకోసం మద్యాన్ని ఏరులై పారించినా, డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ చేసినా విజయం మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థులనే వరించింది. ఆనాడే నాకు అర్థమైంది. రాజకీయాలకి డబ్బులకంటే కూడా ప్రజాకాంక్ష ఉంటే విజయం తథ్యమని తెలిపారు. పైసలకు ఓట్లు రాలవనే దానికి నాటి ఎన్నికలే నిదర్శనం.

సెటిలర్స్ కు పూర్తి రక్షణ

సీమాంధ్ర ప్రజలకు, వ్యాపార వేత్తలకు, వారి ఆస్థులకు పూర్తి రక్షణ కల్పిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సెటిలర్స్ కు రక్షణ ఉండదని సీమాంధ్ర నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప నిజం లేదన్నారు. ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన యువకులే ఆత్మబలిదానం చేసుకున్నారు తప్ప సీమాంధ్ర ప్రజలపైకాని, నేతలపై కాని దాడులు చేసిన సంఘటనలు లేవని తెలుసుకోవాలన్నారు. ఉద్యమంలో భాగంగా అన్ని రకాలుగా నష్టపోయింది తెలంగాణ ప్రజలేతప్ప సీమాంధ్ర వారు కాదనే విషయాన్ని గ్రహించాలన్నారు.

జిహెచ్ఎంసి, హైదరాబాదుపై హక్కులు తెలంగాణకే

డిసెంబర్ 5నాడు కేంద్ర కేబినెట్ ఆమోదించిన తెలంగాణ ముసాయిదా బిల్లులో పదిజిల్లాల తెలంగాణ ఇవ్వడం హర్షించదగిన పరిణామం అన్నారు. జిహెచ్ఎంసి, హైదరాబాదుపై అధికారం తెలంగాణ ప్రాంతం వారికే ఉండాలని గవర్నర్ చేతిలో ఉండరాదని విజ్ఞప్తి చేశారు. హైదరాబాదుపై వచ్చే రెవెన్యూ అంతాకూడా తెలంగాణ రాష్ట్రానికే చెందేలాగా, పోలీస్ (లా & ఆర్డర్), శాంతి భద్రతలకు పూర్తి అధికారాలు కల్పించేవిధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని విన్నవించారు.

టిడిపి, వై.ఎస్.ఆర్.సి.పి. పార్టీలపై నమ్మకం కొరవడింది.

తెలుగుదేశం పార్టీ, వై.ఎస్.ఆర్.సి.పి. లను నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరని విశ్వేశ్వర్ రెడ్డి తెలియజేసారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా అడ్డుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో వీరికి చరమగీతం పాడటం ఖాయమన్నారు. అలాగే తెలంగాణ ప్రాంతంలో వై.ఎస్.ఆర్.సి.పి. దుకాణం బందైందని ఈ పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే దాఖలాలు లేవని తెలిపారు. తెలంగాణ ప్రజానీకం మొత్తం టీఆర్ఎస్ వైపే ఉన్నారని అనేదానికి అనేక ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే నిదర్శనం.

వచ్చే ఎన్నికల్లో చేవెళ్ళ నుండి పోటీ

2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నానని విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. గతంలో కాంగ్రెస్ పాలకులు ఈ పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన దాఖలాలు లేవన్నారు. మా కుటుంబానికి ఎన్నో సంవత్సరాలనుంచి ఇక్కడి ప్రజానీకంతో సన్నిహిత సంబంధాలు కలవని తెలిపారు. ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. అలాగే అక్కడి ప్రజలు కూడా నూతన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, అది టీఆర్ఎస్ ద్వారానే సాధ్యమని భావిస్తున్నారని తెలిపారు. చేవెళ్ళ ప్రజల ఆశీస్సులతో టీఆర్ఎస్ ఎంపీగా పోటీ చేసి ఘనవిజయం సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.

దేశంలోనే చేవెళ్ళను శిఖరాగ్రానికి

చేవెళ్ళ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి వనరులు ఉన్నాయని కాని పాలకుల నిర్లక్ష్యం వల్లనే కుంటుపడిందన్నారు. వచ్చే ఎన్నికల్లో అక్కడి ప్రజానీక అండదండలతో ఎంపిగా గెలుపొంది అనేక నిధులు తెచ్చి, ఉన్న వనరులను ఉపయోగించి అదేవిధంగా హైదరాబాద్ నగరానికి అతి సమీపంలో ఉన్నది కావున ఐటి కంపెనీల ఏర్పాటుకు, తద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. అలాగే ప్రజలకు కూడా మెరుగైన సౌకర్యాలను కల్పిస్తామన్నారు. భవిష్యత్తులో చేవెళ్ళ నియోజకవర్గాన్ని దేశంలోనే ఉన్నత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకు చేవెళ్ళ ప్రజానీకం తనకు ఎంపిగా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ క్రెడిట్ కేసిఆర్ కే

తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు టీఆర్ఎస్ పార్టీని నెలకొల్పి పుష్కర కాలం నుండి ఎన్నో సాధకబాధకాలు పడుతూ పార్టీని విజయపు బాటలో నడిపించడమే కాకుండా నేడు ప్రత్యేక రాష్ట్రం వచ్చే విధంగా కృషి చేసిన ఘనత కేసీఆర్ దే. డిల్లీ పెద్దల మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన క్రెడిట్ కె. చంద్రశేఖరరావు అన్న సంగతి తెలంగాణ ప్రజానీకానికి తెలుసన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో 80పైగా అసెంబ్లీ, 13 పైగా పార్లమెంటు స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకొంటుందని తద్వారా సీఎం కావడం ఖాయమన్నారు.

ప్రపంచ పటంలో తెలంగాణ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అభివృద్ధి విషయంలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉంటుందని విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు వచ్చే మొత్తం ఆదాయాన్ని ఆంధ్రాపాలకులు వారి ప్రాంతాల అభివృద్ధికి వినియోగించుకొని మాగురించి పట్టించుకున్న నాధుడే లేడన్నారు. ప్రత్యేక రాష్ట్రం ద్వారా తమ రెవేన్యూని తామే వినియోగించుకుని విద్య, వైద్య ఉద్యోగ రంగాల్లో, అసాధారణ ప్రగతి సాధించి ప్రపంచ పటంలోనే తెలంగాణ రాష్ట్రం గుర్తింపు పొందుతుందన్నారు.

స్వచ్ఛంద సంస్థలు – పురస్కారాలు

కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాపారం, రాజకీయ రంగాల్లోనే కాకుండా అనేక స్వచ్ఛంద సంస్థలను కూడా నిర్వహిస్తున్నారు. వారి తండ్రి పేరుమీదుగా జస్టిస్ మాధవరెడ్డి ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి దీనికి చైర్మన్ గాను, అలాగే ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్ చైర్మన్ గానూ బాధ్యతలు నిర్వహిస్తూ ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సిస్టమ్స్ కు ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా, హైదరాబాద్ టెన్ కె రన్ ఫౌండేషన్ కు వ్యవస్థాపకులుగా, హైదరాబాద్ యాట్స్ క్లబ్ కు ఫౌండర్ మెంబర్ గాను, ఎ.వి. ఎడ్యుకేషన్ సొసైటీకి మెంబర్ గాను, అపోలో ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఫౌండేషన్ కు మెంబర్ గాను సేవలందిస్తున్నారు. అంతేకాకుండా పరిశోధనా రంగంలో వీరు కనిపెట్టిన వివిధ వినూత్న డిజైనింగ్ కు పేటెంట్ హక్కులను కూడా పొందారు. వీరు రాసిన అనేక పరిశోధనలకు కాపీరైట్స్ కూడా సంపాదించారు. వాటిలో (హైపర్, హైరెప్స్, హైకోర్) మొదలైనవి. ఏ రంగంలో ఉన్నాకూడా తన ప్రతిభకు పదునుపెట్టి వినూత్న టెక్నాలజీని కనుగొని అభివృద్ధి చేయడంతోపాటు, ప్రజలకు సేవచేయడంలో విశ్వేశ్వర్ రెడ్డి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు.


#KondaVishweshwarReddy
#KondaVishweshwar
#KVRforMP
#Chevella
#ChevellaLokSabha
#ChevellaMP
#ChevellaParliament

Download KVR Photos KVR Bio-data